Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో పోటి పడే విధంగా తెలంగాణ ఎదగాలి

Bhatti Vikramarka: ప్రపంచ దేశాలతో అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్యం, ఉపాధి రంగాలే పునాదులని పేర్కొన్నారు. అందుకే ఈ మూడు రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.22 వేల 500 కోట్లతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో, రూ.200 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఒక్కో పాఠశాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇవి కేవలం పాఠశాలలే కాకుండా, భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసే విద్యాకేంద్రాలుగా నిలవనున్నాయని పేర్కొన్నారు.

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా అందించాలనే ఆలోచన ఉందని, ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించామని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి ప్రాధాన్యం పెరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామని చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో అత్యాధునిక వసతులతో వైద్యశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉంటేనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలందరినీ మహాలక్ష్ములుగా గౌరవిస్తూ అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలు అందించామని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.27 వేల కోట్ల వడ్డీరహిత రుణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు దృఢమైన నిర్ణయం తీసుకున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. గతేడాది ఇదే పాఠశాల 150వ వార్షికోత్సవ ప్రారంభోత్సవానికి సీఎం హాజరై రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ప్రస్తుతం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. పాఠశాలలో హైదరాబాద్ స్టేట్ మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పేరుతో మెమోరియల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

అంతకుముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు తీసుకువచ్చిన పంచవర్ష ప్రణాళికల వల్లే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. విద్యతోనే వ్యక్తి, కుటుంబం, సమాజం ఎదుగుతుందని పేర్కొన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. మొగిలిగిద్ద పాఠశాల చరిత్రాత్మక విద్యాలయమని, గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పాఠశాల అభివృద్ధికి, గ్రామ రహదారుల నిర్మాణానికి భారీ నిధులు మంజూరు చేశారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అకస్మాత్తుగా మొగిలిగిద్ద కస్తూర్భా గాంధీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. విద్యార్థినీలతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినీల లక్ష్యాలు, భవిష్యత్ ఆశయాలపై మంత్రులు మాట్లాడి ప్రోత్సహించారు. వసతిగృహంలోని బోధన, బోధనేతర అంశాలపై సిబ్బందిని ప్రశ్నించి పలు సూచనలు చేశారు.

ALSO READ: మంత్రితో డ్యాన్స్ చేసింది నేనే: శాంతి స్వరూప్

Last Updated on January 30, 2026 · 1:44 PM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles