STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 12:49 pm Posted by : Star Trinethram

Mallu Bhatti Vikramarka: అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని త్యాగం చేయం

Mallu Bhatti Vikramarka: పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని త్యాగం చేయబోమని, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ చేతులు కలిపి నడవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగంలో గాలి నాణ్యత సూచీ, గాలి నాణ్యత నిర్వహణ అంశాలపై గురువారం నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. నేడు తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. హైదరాబాద్ ఐటీ, లైఫ్ సైన్సెస్, తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా ఎదగడం గర్వకారణమని తెలిపారు. అయితే ఈ అభివృద్ధి ప్రజల ఆరోగ్యానికి భారం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

సుస్థిర అభివృద్ధి మార్గంలో మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. అదే సమయంలో జలాశయాల పునరుద్ధరణ, సహజ వనరుల సంరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందన్నారు. శుభ్రమైన గాలి లేకుండా జరిగే అభివృద్ధి నిజమైన ప్రగతి కాదని, అది కేవలం ఆలస్యమైన నష్టమేనని హెచ్చరించారు. గాలి నాణ్యత అనేది పర్యావరణ సూచీ మాత్రమే కాకుండా ప్రజారోగ్యం, ఉత్పాదకత, ఆర్థిక వ్యవస్థకు కూడా కీలక సూచీ అని వివరించారు.

2024 స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ సహా ప్రపంచ స్థాయి అధ్యయనాలు గాలి కాలుష్య తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గాలి కాలుష్యం నేడు అధిక రక్తపోటు తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండో ప్రధాన కారణంగా మారిందని, ప్రతి ఏడాది ఎనిమిది మిలియన్లకు పైగా అకాల మరణాలకు ఇది కారణమవుతోందన్నారు. పిల్లలు, వృద్ధులు, పనిచేసే జనాభా గాలి కాలుష్య ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారని తెలిపారు.

ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం గాలి కాలుష్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా నాలుగు ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. అందుకే శుభ్రమైన గాలి గురించి మాట్లాడటం అంటే మనుషుల జీవితాల గురించి, ఆర్థిక బలం, సామాజిక శ్రేయస్సు గురించి మాట్లాడటమేనని అన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం గర్వకారణమేనని, అయితే నగర వ్యవస్థలు కూడా అదే స్థాయిలో పరిపక్వం చెందాల్సిన అవసరం ఉందని సూచించారు.

గాలి నాణ్యత పర్యవేక్షణలో భాగంగా 2024లో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 40 కొత్త గాలి నాణ్యత స్టేషన్లను ఏర్పాటు చేసి నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసినట్లు తెలిపారు. త్వరలోనే ప్రజలకు సమాచారం అందించేందుకు గాలి నాణ్యత డాష్‌బోర్డులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాలుష్య నియంత్రణలో పారదర్శకత, డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

రవాణా రంగంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ బస్సులు, మెట్రో విస్తరణ ద్వారా ప్రజా రవాణాను బలోపేతం చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులు నిర్మిస్తున్నామని చెప్పారు. పాత, కాలుష్యకర వాహనాలను తొలగించేందుకు రిజిస్టర్డ్ వాహన స్క్రాపింగ్ కేంద్రాలను ప్రారంభించామని వెల్లడించారు. పరిశ్రమల ఉద్గారాలను నిరంతరం పర్యవేక్షించేందుకు కాలుష్య నియంత్రణ మండలి సర్వర్లతో అనుసంధానించామని తెలిపారు.

2025 పునరుత్పాదక శక్తి విధానం ద్వారా 2030 నాటికి 20 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించామని భట్టి విక్రమార్క తెలిపారు. సౌర, గాలి, గ్రీన్ హైడ్రజన్ ద్వారా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. నగర పరిధుల్లో పరిశ్రమలు నివాస ప్రాంతాల మధ్య ఉండటం వల్ల ఏర్పడుతున్న సమస్యలను గుర్తించి, కాలుష్య ఫిర్యాదులకు వేగంగా స్పందించేందుకు రెండు జీహెచ్ఎంసీ జోన్లలో ప్రత్యేక బృందాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఫలితాల ఆధారంగా ఈ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొన్న ఈ సదస్సు తమకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ALSO READ: Telangana: కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కవిత స్పందన