ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు
ప్రతిపక్షాలకు శాపం.. అధికార పార్టీకి వరంగా మారిన షెడ్యూల్
గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్
Election notification issueg: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వగా, షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ ద్వారా ఎన్నికల సంఘంపై ఘాటు విమర్శలు చేశారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలా.. లేక అధికార పార్టీ కుట్రగా మారాలా.. అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే, కనీసం ఒక్క రోజు గడువు కూడా ఇవ్వకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి జరుగుతోందని విమర్శించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఎన్నికల సంఘం పూర్తిగా విస్మరించిందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కోట్లాది మంది భక్తులు మేడారం వెళ్లే సమయంలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడమేనన్నారు. భక్తిశ్రద్ధలు, సంప్రదాయాలకు కనీస గౌరవం కూడా చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల కమిషన్ ప్రభుత్వం చేతిలో తోలుబొమ్మలా మారిందని దాసోజు శ్రవణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అనేవి ఆఫీసుల్లో ఫైళ్లను క్లియర్ చేసినట్టు హడావుడిగా ముగించాల్సిన ప్రక్రియ కాదని, అవి ప్రజాస్వామ్యానికి పునాదులని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో స్వతంత్రత, పారదర్శకత కనిపించడంలేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఎలాంటి రాజ్యాంగ సంక్షోభం లేకపోయినా ఇంత తొందరపాటు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ షెడ్యూల్ ప్రతిపక్ష పార్టీలకు, మహిళలకు, కొత్త అభ్యర్థులకు శాపంగా మారుతుందని, అధికార పార్టీకి మాత్రం వరంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇది సమాన అవకాశాలతో జరిగే పోటీ కాదని, ఉద్దేశపూర్వకంగా సృష్టించిన వ్యవస్థీకృత అసమానత అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. సమయం తగ్గించడం వల్ల ఎన్నికలు డబ్బు, మద్యం, కండబలం చుట్టూనే తిరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కై స్థానిక సంస్థల ఎన్నికలను మేనేజ్డ్ డ్రామాగా మార్చేశారని ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వ్యవహారాన్ని పునఃపరిశీలించి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కోరారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది.
ALSO READ: Revanth Reddy campaign: మున్సిపల్ ఎన్నికలు.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి
Last Updated on January 28, 2026 · 2:22 PM by Star Trinethram



